రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
మహబూబ్‌నగర్, జనవరి 11: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన శేషయ్య (73), ఆయన భార్య నవనీతమ్మ (64) ఇటీవల సంగారెడ్డిలో నివసిస్తున్న తమ కుమారుడిని కలిసి, హైదరాబాద్‌లో ఉన్న తమ ప్రాపర్టీలను పరిశీలించిన అనంతరం తిరుపతిలో ఉన్న కుమార్తెను కలుసుకోవడానికి స్వంత కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో సీటు బెల్టులు ధరించకపోవడం తదితర కారణాలతో శేషయ్య, నవనీతమ్మ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే ప్రమాదానికి కారణమైన కారులో ఎయిర్ బెలూన్లు (ఎయిర్‌బ్యాగ్స్) ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

Post a Comment