రామగుండం అభివృద్ధికి 175 కోట్ల పనులకు మంత్రుల శంకుస్థాపనలు
రామగుండం, జనవరి 11: రామగుండం నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ ముందడుగు వేసింది. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామగుండం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా మొత్తం రూ.175 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా
- రూ.80.52 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు,
- రూ.88.90 కోట్లతో తాగునీటి సరఫరా కోసం కొత్త పైప్‌లైన్ నిర్మాణ పనులకు,
- రూ.6.50 కోట్లతో రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులకుమంత్రులు శంకుస్థాపనలు చేయనున్నారు.
నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పైప్‌లైన్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అంతర్గత రహదారుల అభివృద్ధి, భవనాల నిర్మాణాలతో రామగుండం నగరానికి కొత్త రూపు రానుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో అర్హులైన లబ్ధిదారులకు
- ఇందిరమ్మ పథకం కింద ఇండ్ల మంజూరు పత్రాలు,
- భూమి పట్టాలు,
- రెండు పడక గదుల ఇండ్ల ప్రొసీడింగ్స్మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొననున్నారు. రామగుండం అభివృద్ధిలో ఈ శంకుస్థాపనలు కీలక మైలురాయిగా నిలుస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు.

Post a Comment