-->

ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్తనిధుల అన్వేషణ

తుర్కపల్లి మండలంలో మూఢనమ్మకాల పేరిట తవ్వకాలు – ఆరుగురు అరెస్ట్


యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహం కింద తవ్వకాలు చేసిన ఘటన కలకలం రేపింది. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో సాగిన ఈ అక్రమ తవ్వకాలను పోలీసులు అడ్డుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల మాదాపూర్ గ్రామ పరిధిలోని కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి ఈసీఐఎల్‌కు చెందిన పులి కుమార స్వామిని సూపర్‌వైజర్‌గా నియమించాడు. అయితే నెలసరి వేతనం సరిపోవడం లేదని భావించిన కుమార స్వామి, ఈజీ మనీ కోసం గుప్తనిధులపై కన్నేశాడు.

వ్యవసాయ భూమిలో ఉన్న చిన్న గుట్టపై ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటంతో, దాని కింద గుప్తనిధులు ఉంటాయని అతడు నమ్మాడు. ఈ ఆలోచనతో విజయవాడకు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.

చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించి హిటాచీ సహాయంతో తవ్వకాలు చేపట్టారు. అయితే గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన హిటాచీ యంత్రం, కారు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్తనిధుల తవ్వకాలు చేయడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. గుప్తనిధుల పేరుతో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793