కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలేసిన కూతురు
జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలంలో మానవత్వం తలదించుకునే హృదయ విదారక ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని కుమార్తె ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది.
మండలంలోని పెద్ద ఆముదాలపాడు గ్రామానికి చెందిన పుణ్యవతి (62), రామిరెడ్డి దంపతులు. వీరికి కుమార్తె కవిత. కొన్నేళ్ల క్రితం రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. దాదాపు 14 సంవత్సరాల క్రితం కవిత తన తల్లి పుణ్యవతి, భర్త శ్రీనివాసరెడ్డితో కలిసి మానవపాడుకు వచ్చి నివాసం ఉంటోంది. శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే ఆయన కూడా ఏడేళ్ల క్రితం మృతి చెందాడు.
అప్పటి నుంచి తల్లి–కూతురు ఇద్దరూ అక్కడే ఉండి చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పుణ్యవతి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో, ఇటీవల కవిత ఆమెను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఇక వైద్యం సాధ్యం కాదని చెప్పి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్న కవిత, బుధవారం రాత్రి కొన ఊపిరితో ఉన్న తన తల్లిని ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తరువాత పుణ్యవతి అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, బస్టాండ్‌లో వదిలి వెళ్లిన కుమార్తెకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని పెద్ద ఆముదాలపాడు గ్రామానికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనను కలిగిస్తూ, మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Post a Comment