-->

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య అప్పులబాధే కారణమని అనుమానం

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య అప్పులబాధే కారణమని అనుమానం


హసన్‌పర్తి, జనవరి 12: హసన్‌పర్తి మండలంలోని చింతగట్టు రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికుడ మండలం చరపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు దూడ రాజు (24) హన్మకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వార్డెన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై చింతగట్టు రైల్వే గేట్ సమీపానికి వచ్చిన రాజు, ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు వెల్లడించారు.

ఘటన స్థలంలో లభ్యమైన ద్విచక్ర వాహనం వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన రాపర్తి కోర్నెలు కుమారుడు అనిల్ కుమార్ పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉండటంతో, తొలుత మృతుడి గుర్తింపు విషయంలో అయోమయం నెలకొంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, వాహనంపై ఉన్న చలన్ల ఆధారంగా మృతుడు దూడ రాజుగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

గ్రామస్తుల కథనం ప్రకారం అప్పులబాధ తాళలేకనే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉండగా, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

ఘటన స్థలాన్ని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాజిద్ ఆలీ పరిశీలించగా, మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై రైల్వే జీఆర్‌పీ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793