ఎన్నికల హామీ అమలు పేరుతో కిరాతకత్వం
హనుమకొండ జిల్లాలో కలకలం… 120కి పైగా కుక్కల మృతదేహాలు లభ్యం
జంతు హింస చట్టం కింద 9 మందిపై కేసు నమోదు
హనుమకొండ, జనవరి 12: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో చేసిన చర్యలు చివరకు చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టిన ఘటన హనుమకొండ జిల్లాలో సంచలనంగా మారింది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు సర్పంచ్‌లు వీధికుక్కల సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో అత్యంత అమానుషమైన మార్గాన్ని ఎంచుకున్నారన్న ఆరోపణలతో పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు.
ఈ రెండు గ్రామాల్లో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో పాటు కుక్కకాటు ఘటనలు, చర్మ వ్యాధుల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎన్నికల సమయంలో సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అనంతరం శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపట్టాల్సింది పోయి, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి 120కి పైగా వీధికుక్కలను విషప్రయోగం ద్వారా హతమార్చి పాతిపెట్టినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఫిర్యాదు మేరకు పోలీసులు, పశువైద్యాధికారులు గ్రామాల్లో తవ్వకాలు జరపగా పాతిపెట్టిన 120కి పైగా కుక్కల కళేబరాలు లభ్యమయ్యాయి. అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ వైద్యులు, శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమికంగా విషప్రయోగం ద్వారానే మూగజీవాలను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై గ్రామాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గ్రామస్తులు కుక్కకాటు ఘటనలు, వ్యాధుల నేపథ్యంలో సర్పంచ్‌ల చర్యను సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ఘోరమైన మానవత్వ రాహిత్య చర్యగా విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా, జంతు హింస నిరోధక చట్టం (PCA Act, 1960) ప్రకారం వీధికుక్కలను హతమార్చడం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సర్పంచ్‌లు సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Post a Comment