కంటైనర్ బీభత్సం వ్యక్తి మృతి దంపతులు స్వల్పంగా తప్పించుకున్న ప్రమాదం
కరీంనగర్/కామారెడ్డి | జనవరి 12: కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆదివారం భారీ కంటైనర్ లారీ బోల్తా పడిన ఘటనలో రానావేణి హన్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, కామారెడ్డి జిల్లాలో మరో కంటైనర్ లారీ ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం కంటైనర్ లారీ ఓ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు.
నిజామాబాద్ టౌన్‌కు చెందిన సృజన్ మోహన్ రెడ్డి, పద్మ దంపతులు ఆదివారం ఉదయం నిజామాబాద్ నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో, అదుపు తప్పి వచ్చిన కంటైనర్ లారీ వారి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీ తీవ్రతకు కారు కొద్ది దూరం వరకు లారీ కింద ఈడ్చుకెళ్లబడింది.
ప్రమాద సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న దంపతులు ఎట్టకేలకు కారులో నుంచి బయటపడగలిగారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. షాక్‌కు గురైన మోహన్ రెడ్డి, పద్మ కొంతసేపటికి తేరుకుని ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కంటైనర్ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Post a Comment