సంక్రాంతి పండగకు ఊరు వెళ్లేదెలా? పలు బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో నగరాల నుంచి పల్లెల బాట పట్టే ప్రజలతో హైదరాబాద్ నగరం రద్దీగా మారింది. శుక్రవారం సాయంత్రం నుంచే సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు క్యూ కట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ జిల్లాల వైపు వెళ్లే రూట్లలో ప్రయాణికుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాల్సిన ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల బస్టాండ్లలో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు ఆలస్యంగా రావడం, సరిపడా సర్వీసులు లేకపోవడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
బస్టాండ్లలో వచ్చిపోయే బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీయడం, సీట్ల కోసం తోపులాటకు దిగడం వంటి దృశ్యాలు సాధారణంగా కనిపించాయి. కాలేజీలు, హాస్టళ్లు, పాఠశాలలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో బస్టాండ్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత అనేక రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, ములుగు, మహబూబాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపేవారని ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి ఆ ప్రత్యేక బస్సులు కనిపించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సులపై ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల వంటి రూట్లలో నడుపుతుండటంతో ప్రయాణికులు మోసపోతున్నారు. అంతేకాకుండా ఆ బస్సులు కూడా నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది.
సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లేందుకు సరిపడా రైళ్లు, ప్రత్యేక బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. అధిక చార్జీలు చెల్లించాల్సి రావడంతో పాటు భద్రతాపరమైన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. పండుగకు ఊరెళ్లాలంటే ఎలాంటి వసతులు లేక ప్రజలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment