సిగరెట్లు, పాన్ మసాలాపై నేటి నుంచే కొత్త పన్నులు
దేశంలో ‘సిన్ గూడ్స్’గా పిలిచే పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 28 శాతం జీఎస్‌టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్‌ను రద్దు చేసి, ఇప్పుడు 40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్‌ను విధించింది. ఈ నిర్ణయంతో సిగరెట్ల ధరలు 15 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
సిగరెట్ పొడవు ఆధారంగా అదనపు ఎక్సైజ్ డ్యూటీ
సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకాన్ని బట్టి పన్నులను ప్రభుత్వం ఖరారు చేసింది.
- 65 మి.మీ లోపు (నాన్-ఫిల్టర్): ఒక్కో సిగరెట్‌పై రూ. 2.05
- 65 మి.మీ లోపు (ఫిల్టర్): ఒక్కో సిగరెట్‌పై రూ. 2.10
- మీడియం (65–70 మి.మీ): ఒక్కో స్టిక్‌పై సుమారు రూ. 4
- ప్రీమియం/లాంగ్ (70–75 మి.మీ): ఒక్కో స్టిక్‌పై రూ. 5.40 వరకు అదనపు భారం
కొన్ని కేటగిరీల్లో వెయ్యి సిగరెట్లపై రూ. 8,500 నుంచి రూ. 11,000 వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు.
పాన్ మసాలాపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్
పాన్ మసాలా, గుట్కా తయారీదారులు ఇకపై తమ ప్యాకింగ్ మెషీన్ల సామర్థ్యం ఆధారంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తయారీ కేంద్రాల్లో తప్పనిసరిగా CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజీని 24 నెలల పాటు భద్రపరచాలని కేంద్రం ఆదేశించింది.
పచ్చి పొగాకుపై 60–70 శాతం, ఈ-సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులపై 100 శాతం పన్ను విధిస్తూ ప్రభుత్వం తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.
నిపుణుల హెచ్చరిక
ధరలు పెరిగితే ప్రజలు ధూమపానానికి దూరమవుతారని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు అధికంగా ఉంటే, స్మగ్లింగ్ సిగరెట్లు, నకిలీ ఉత్పత్తుల వినియోగం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రజల ఆరోగ్యంపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Post a Comment