-->

తెలుగు రాష్ట్రల రైతన్నలు అలర్ట్.. వారం రోజుల పాటు వర్షాల అవకాశం

 

తెలుగు రాష్ట్రల రైతన్నలు అలర్ట్.. వారం రోజుల పాటు వర్షాల అవకాశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. ఒకవైపు ఉత్తరాంధ్రలో చల్లటి వాతావరణం నెలకొనగా, తెలంగాణలో ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగుతోంది. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత 26°Cగా నమోదై ఉండగా, గరిష్టంగా 28°C వరకు పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో అకాల వర్షాలు

తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33°C నుంచి 40°C వరకు నమోదవుతున్నాయి. అయితే ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కొంత ఉపశమనం కలిగించే సమాచారం ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా అదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వచ్చే వారం వాతావరణంలో మార్పులు

ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలో వేడి గాలులు, పొడి వాతావరణం కొనసాగనుంది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత అధికంగా ఉంది.

అయితే వచ్చే వారం కురిసే వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ మార్చి చివరి నాటికి, ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు మళ్లీ సాధారణం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793