ఎస్సై చైతన్య చందర్ సస్పెన్షన్ – సెలూన్ ఘటనపై కఠిన చర్యలు
కరీంనగర్ జిల్లా, ఏప్రిల్ 26: కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న సెలూన్ దాడి ఘటనపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంది. సామాన్య పౌరుడిపై దాడి చేసిన ఆరోపణలతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ఎన్. చైతన్య చందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
శనివారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో ఖాన్‌పురా పరిధిలోని దుర్గమ్మగడ్డ ప్రాంతంలో ఉన్న ‘న్యూ ప్రజా హెయిర్ స్టైల్’ సెలూన్‌కు ఎస్సై చైతన్య చందర్ వెళ్లారు. ఆ సమయంలో షాప్ శుభ్రం చేస్తున్న కార్మికుడు పగడాల రాము (50) మర్యాదపూర్వకంగా “అన్నా కూర్చో” అని పలకరించగా, ఎస్సై ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం అసభ్య పదజాలంతో దూషిస్తూ రాముపై చేయి చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సెలూన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఘటన సమయంలో ఎస్సై చైతన్య చందర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బందోబస్త్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, సామాన్య పౌరుడిపై దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయడం, విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించడం వంటి అంశాలు నిర్ధారణకు రావడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, డీఐజీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ స్పష్టం చేస్తూ, “పోలీస్ శాఖ క్రమశిక్షణకు ప్రతీక. ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం లేదా అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Post a Comment