-->

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… తల్లి, ఇద్దరు కుమారులు మృతి

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… తల్లి, ఇద్దరు కుమారులు మృతి


యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొట్టడంతో తల్లి, ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం భువనగిరి మండలం పరిధిలోని వడపర్తి గ్రామం శివారులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీఎన్ తిమ్మాపూర్ గ్రామంకు చెందిన డొంకెన కేతమ్మ (56) కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, ఆమె భర్త శ్రీనివాస్ గీత వృత్తి చేస్తున్నారు. వీరికి కుమారులు నరేశ్ (35), ఉమేశ్, సురేశ్ (28) ఉన్నారు.

నరేశ్‌కు మూర్ఛవ్యాధి ఉండటంతో ఇంటి వద్దే ఉండేవాడు. సురేశ్ ఆర్టీసీలో ఒప్పంద డ్రైవర్‌గా పని చేస్తూ ఖాళీ సమయంలో సొంత ఆటో కూడా నడిపేవాడు.

సోమవారం మధ్యాహ్నం తల్లి కేతమ్మ, కుమారులు నరేశ్, సురేశ్ కలిసి కిరాణా సరుకులు తెచ్చేందుకు భువనగిరికి ఆటోలో వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి నుంచి బీఎన్ తిమ్మాపూర్ వైపు వస్తుండగా అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో డీసీఎం కూడా నియంత్రణ కోల్పోయి ముందున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సురేశ్, అతని అన్న నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కేతమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు.

ప్రమాదం అనంతరం వ్యాన్ల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ రవీందర్, గ్రామీణ సీఐ చంద్రబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793