అత్తను హెల్మెట్‌తో కొట్టి హత్య చేసిన అల్లుడు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ప్రాణహానికి దారి తీసిన ఈ ఘటనలో అల్లుడు తన అత్తను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె కావ్య (19) గతేడాది కరీంనగర్ జిల్లా చందన్‌పూర్‌కు చెందిన కర్రు స్నేహిత్ (28)ను ప్రేమ వివాహం చేసుకుంది.
ఇటీవల కుటుంబంలో విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది. గత నెల 29వ తేదీ రాత్రి స్నేహిత్ ఫోన్ చేసి తన భార్యపై అసహనం వ్యక్తం చేస్తూ అత్త అరుణతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
మరుసటి రోజు మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లిన సమయంలో స్నేహిత్ ఆమెను బైక్‌పై తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే కావ్యకు ఫోన్ చేసి ‘అత్తమ్మకు ఫిట్స్ వచ్చి పడిపోయింది, ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను’ అని చెప్పాడు.
అయితే అనుమానం వచ్చిన కావ్య, చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. అందులో స్నేహిత్ అరుణతో వాగ్వాదానికి దిగిన తరువాత హెల్మెట్‌తో తీవ్రంగా కొట్టడం, దాంతో ఆమె నడుస్తున్న బైక్‌పై నుంచి కిందపడటం స్పష్టంగా కనిపించింది.
తలకు తీవ్ర గాయాలు కావడంతో అరుణను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ అదేరోజు ఆమె మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు స్నేహిత్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ విభేదాలు ఇలాంటి దారుణాలకు దారి తీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment