-->

ప్రకాశం జిల్లాలో హిజ్రా హత్య కలకలం

ప్రకాశం జిల్లాలో హిజ్రా హత్య కలకలం


ప్రకాశం జిల్లా కందుకూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. హిజ్రాతో రెండేళ్లపాటు సహజీవనం చేసిన వ్యక్తి, అనుమానంతో ఆమెను హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం… గుడ్లూరు మండలం పెదలాటరపికి చెందిన పొట్లూరి అంకయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కనిగిరి పట్టణం కాశిరెడ్డి కాలనీకి చెందిన రాపూరి పేరయ్య అలియాస్ పేరమ్మ అలియాస్ ప్రియ (26)తో పరిచయం ఏర్పడి, ఇద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

ఇటీవల ప్రియ మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో అంకయ్యలో అనుమానం పెరిగింది. ఈ నేపథ్యంలో మాట్లాడాలని చెప్పి గత నెల 27న ప్రియను కందుకూరుకు రప్పించాడు. అక్కడ పోతురాజుమిట్టలో ఉన్న తన పిన్ని ఇంటికి తీసుకెళ్లి, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే ప్రియ నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన అంకయ్య, ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

తర్వాత పరిస్థితిని కప్పిపుచ్చేందుకు ప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మరో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించి పరారయ్యాడు.

ప్రియ మెడపై గాయాలు గమనించిన తండ్రి అంజయ్యకు అనుమానం రావడంతో కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో హత్య జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంకయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793