లారీని ఢీకొన్న టూ వీలర్ – ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
భోగాపురం, ఏప్రిల్ 29: దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటి బాట పట్టిన ఒక కుటుంబానికి రోడ్డు ప్రమాదం రూపంలో విషాదం ఎదురైంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన సంచన సాయికుమార్ (24), గార మండలం దీపావళి గ్రామానికి చెందిన అత్త లావేటి చిన్నమ్మడు (45), ఆమె మనవరాలు సీహెచ్ రుత్విక (4) కలిసి ద్విచక్రవాహనంపై సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భోగాపురం సచివాలయం సమీపానికి చేరుకున్న సమయంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో వారి బైక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ రోడ్డుపై పడిపోగా, తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో జరిగిన ఈ విషాదాన్ని చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురై కన్నీరు పెట్టుకున్నారు.
సాయికుమార్ ఇటీవలే వివాహం చేసుకున్నాడు. అతని భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. కుటుంబంతో కలిసి విశాఖపట్నం మర్రిపాలెంలో నివసిస్తూ డోర్ డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్నాడు. వారాల పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన అతను, అత్త కోరిక మేరకు సింహాచలం వెళ్లి ఈ ప్రమాదానికి గురయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడిషనల్ ఎస్పీ పి. సౌమ్యలత, ఇతర అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతి స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Post a Comment