బెడ్‌రూంలో భార్య.. బాత్‌రూంలో భర్త మృతి – బాపట్ల జిల్లాలో విషాదం
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువ దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో, వారి 14 నెలల చిన్నారి అనాథగా మిగిలింది.
వేటపాలెం మండలం రావురిపేట గ్రామానికి చెందిన మాజేటి ప్రభాకర్, పార్వతి దంపతులు ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 14 నెలల వయసున్న పాప ఉంది. కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
మంగళవారం మధ్యాహ్నం పార్వతి తన చిన్నారిని పక్కింటివారికి అప్పగించి ఇంట్లోకి వెళ్లింది. చాలా సేపు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రభాకర్ సోదరుడు ఇంటికి వెళ్లి చూసినప్పుడు తలుపులు లోపల నుంచి బిగించి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా, ఇద్దరూ మృతి చెందిన స్థితిలో కనిపించారు.
ఇంట్లోని బెడ్‌రూంలో పార్వతి, బాత్‌రూంలో ప్రభాకర్ మృతదేహాలు గుర్తించారు. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఈ ఘటన జరగడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి పరిస్థితి గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది.

Post a Comment