స్మశానంలో నివసిస్తున్న కుటుం బానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ సహాయం
కరీంనగర్, ఏప్రిల్ 29: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముందుకు వచ్చారు. నివాసం లేక స్మశానవాటికలో తలదాచుకుంటున్న ఆ కుటుంబ దుస్థితిపై ఆయన స్పందించి ఆర్థిక, మానసిక బరోసా కల్పించారు.
గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తూ జీవనం సాగించిన శ్రీకాంత్ మరణానంతరం, ఇంటి యజమాని కుటుంబాన్ని లోపలికి అనుమతించకపోవడంతో వారు పద్మానగర్ స్మశానవాటికలో నివాసం ఉంటున్న విషయం తెలిసిన వెంటనే మేయర్ అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికి నిత్యావసర సరుకులు అందజేసి తక్షణ సహాయం చేశారు. అలాగే కుటుంబంలోని ఆడపిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి విషయం తీసుకెళ్లి, పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమై, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

Post a Comment