-->

భూపాలపల్లిలో కోతుల బీభత్సం.. వ్యక్తి మృతి

భూపాలపల్లిలో కోతుల బీభత్సం.. వ్యక్తి మృతి


భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో కోతుల బీభత్సం ఒక ప్రాణాన్ని బలిగొంది. కాలనీలో నివాసం ఉంటున్న కిషన్ (45) అనే వ్యక్తి కోతుల దాడికి గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం కిషన్‌పై కోతులు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల కథనం ప్రకారం, జవహర్ నగర్ కాలనీలో గత కొంతకాలంగా కోతుల సమస్య తీవ్రమైంది. కోతులు తరచూ ప్రజలపై దాడులు చేయడం, ఇళ్లలోకి చొరబడటం వంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు మరియు పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

“మున్సిపాలిటీకి పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణం” అంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే కోతుల నియంత్రణపై సమగ్ర చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793