సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్ కలకలం – పానీపూరి తిని 20 మంది అస్వస్థత
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్ కలకలం – పానీపూరి తిని 20 మంది అస్వస్థత
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆందోళన కలిగించింది. సోమవారం సాయంత్రం స్థానిక పానీపూరి బండి వద్ద తిన్న దాదాపు 20 మంది మంగళవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురయ్యారు.
బాధితుల్లో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, రిషికేశ్ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో పాటు ఫిట్స్ వచ్చినట్లు తెలిపారు. మరో ఎనిమిది మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అస్వస్థతకు కారణం నిజంగా పానీపూరి తినడమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. అందరికీ ఒకే విధమైన లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సంబంధిత పానీపూరి బండి నుంచి ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత అస్వస్థతకు అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారులు ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Post a Comment