లష్కర్ బోనాల తేదీలు ఖరారు.. ఆగస్టు 3న రంగం కార్యక్రమం
లష్కర్ బోనాల తేదీలు ఖరారు.. ఆగస్టు 3న రంగం కార్యక్రమం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరకు తేదీలు ఖరారయ్యాయి. బోనాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది బోనాల పండుగ జూలై 19న ప్రారంభమై ఆగస్టు 10 వరకు వైభవంగా కొనసాగనుంది.
మొదటగా జూలై 19న గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు నగరంలోని పలు ఆలయాల్లో ఘటాల ఊరేగింపులు కూడా ప్రారంభమవుతాయి.
బోనాల ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలు ఆగస్టు తొలి వారంలో జరగనున్నాయి. ఆగస్టు 2న లష్కర్ ప్రాంతంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో బోనాలు సమర్పించనున్నారు.
ఆగస్టు 3న శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పవిత్ర రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారి అంబారీ ఊరేగింపు వైభవంగా సాగనుంది.
గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు మరియు పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కార్యక్రమాలతో కొనసాగి, ఆగస్టు 10న ఘటాల సామూహిక ఊరేగింపు, గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ముగియనున్నాయి.
రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసులు, జలమండలి, విద్యుత్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు, భారీ బందోబస్తు చేపట్టనున్నాయి.

Post a Comment