-->

నాలుగేళ్లుగా విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది ప్రభుత్వ వైద్యుల డిస్మిస్

నాలుగేళ్లుగా విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది ప్రభుత్వ వైద్యుల డిస్మిస్

నాలుగేళ్లుగా విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది ప్రభుత్వ వైద్యుల డిస్మిస్

అమరావతి, జూన్ 17: ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నాలుగేళ్లుగా విధులకు హాజరు కాకుండా ఉన్న 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లను శాశ్వతంగా సేవల నుంచి తొలగించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వైద్యులు దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉండటంతో పాటు, వారికి నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి, అభియోగాలు నమోదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో వారిని ప్రభుత్వ సేవల నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.

ఇటీవల మే నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులను కూడా ఇదే కారణంతో విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) పరిధిలో పనిచేసే వైద్యుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

అధికారిక సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 118 మంది శాశ్వత ప్రభుత్వ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్యులు ఉన్నారు.

ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి ఏడాదికి మించి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతే సేవల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నిబంధనల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇక 43 మంది వైద్యులతో పాటు, మరో 34 మంది వైద్యులకు కూడా సంజాయిషీ నోటీసులు జారీ చేసి అభియోగాలు నమోదు చేశారు. అనంతరం వారిలో పలువురు రాజీనామాలు సమర్పించగా, అందులో 15 మంది రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ వైద్య సేవల్లో క్రమశిక్షణను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793