ఉప సర్పంచ్‌లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం!
ఉప సర్పంచ్‌లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉపసర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసి, ఆ అధికారాన్ని గ్రామ కార్యదర్శికి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే గ్రామపంచాయతీ నిధులకు సంబంధించిన చెక్కులు సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి సంతకాలతోనే ఆమోదం పొందనున్నాయి.
పాలనలో జవాబుదారీతనం పెంపుదలే లక్ష్యం
గ్రామస్థాయిలో పాలన మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేలా ఒక ప్రజాప్రతినిధి, ఒక అధికారి కలిసి వ్యవహరించే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంయుక్త సంతకాలతో నిధుల విడుదల జరుగుతుండగా, అనేక చోట్ల రాజకీయ విభేదాల కారణంగా అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు గుర్తించారు.
అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారిన చెక్ పవర్
ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండటం వల్ల గ్రామపంచాయతీల్లో పలు సమస్యలు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య రాజకీయ విభేదాలు నెలకొనడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం, చెక్కులపై సంతకాలు ఆలస్యం కావడం, అభివృద్ధి పనులు మందగించడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
అంతేకాకుండా, కొంతమంది సర్పంచ్‌లు తమ గౌరవ వేతనాలకు సంబంధించిన చెక్కులపై కూడా ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి కావడంపై గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థాయిలో పరిపాలన సజావుగా సాగేందుకు ప్రస్తుత విధానంలో మార్పులు అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు.
చెక్ పవర్ చరిత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయాలనే ప్రతిపాదన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఆ నిర్ణయం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ముఖ్యమంత్రి, మంత్రులకు కూడా లేని చెక్ పవర్ కేవలం సర్పంచ్‌లకు ఎందుకు అనే చర్చ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగింది.
తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌లకు కూడా చెక్ పవర్ కల్పించింది. గ్రామ కార్యదర్శిని ఆ ప్రక్రియ నుంచి తప్పించింది. అయితే ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అనేక పరిపాలనా సమస్యలు ఉత్పన్నమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలో క్యాబినెట్ ముందుకు ప్రతిపాదన
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేసి, సర్పంచ్-గ్రామ కార్యదర్శి సంయుక్త సంతకాల విధానాన్ని అమలు చేసే అంశంపై రాజకీయ స్థాయిలో దాదాపు నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. ఇక అధికారిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని అధికారులు చెబుతున్నారు. క్యాబినెట్ ఆమోదం అనంతరం చట్టసవరణలు చేపట్టి కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే గ్రామపంచాయతీల్లో నిధుల వినియోగం వేగవంతం కావడంతో పాటు అభివృద్ధి పనుల అమలులో ఎదురవుతున్న జాప్యాలకు కూడా చెక్ పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment