నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును అదే దిశలో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దకాపర్తి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు, బస్సు డ్రైవర్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను తీవ్ర శ్రమతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Post a Comment