-->

శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి వెళ్లిన కుటుంబం.. రైలు ఢీకొని నలుగురి మృతి..

 

శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి వెళ్లిన కుటుంబం.. రైలు ఢీకొని నలుగురి మృతి..

శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి వెళ్లిన కుటుంబం.. రైలు ఢీకొని నలుగురి మృతి.. ప్రమాదమా? బలవన్మరణమా?

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నామని పక్కింటి వారికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక బలవన్మరణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మామిడి తోట ప్రాంతంలో నివసిస్తున్న షేక్‌ చాంద్‌ బాషా (50), ఆయన భార్య షేక్‌ హసీనా (45), కుమార్తెలు షర్మిల (23), సమీర (20) శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి తాడేపల్లిగూడెం బస్టాండ్‌లో మోటార్‌సైకిల్‌ను పార్క్‌ చేసి, ఏలూరు వెళ్లే బస్సులో ప్రయాణించారు.

చేబ్రోలు రైల్వే స్టేషన్‌ బస్టాప్‌ వద్ద దిగిన అనంతరం టిఫిన్‌ పొట్లాలు తీసుకుని రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లారు. రాత్రి సుమారు 8:40 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌ను దాటుతున్న సమయంలో చర్లపల్లి–షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.

ట్రాక్‌పై ఒక్కసారిగా దిగడంతో తాను పలుమార్లు హారన్‌ మోగించినప్పటికీ వారు తప్పుకోలేదని రైలు లోకో పైలట్‌ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రైలు సుమారు అరగంటపాటు నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ అప్పారావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా మృతుల నివాసానికి వెళ్లిన పోలీసులు స్థానికులను విచారించారు. చాంద్‌ బాషా చిన్నపాటి కళ్లజోళ్ల మరమ్మత్తుల దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడని, వ్యాపారం సరిగా లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల గుండెపోటుతో ఆయనకు స్టంట్‌ కూడా వేసినట్లు వెల్లడించారు.

కుటుంబ పరిస్థితులు కూడా క్లిష్టంగానే ఉన్నాయని సమాచారం. పెద్ద కుమార్తె షర్మిల అనారోగ్యంతో బాధపడుతుండగా, చిన్న కుమార్తె సమీర వివాహానంతరం భర్తతో విభేదాల కారణంగా నాలుగు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు కలిసి ఈ ఘటనకు కారణమయ్యాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుతం ఇది ప్రమాదమా, లేక బలవన్మరణమా అన్న దానిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదని, అన్ని ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని రైల్వే పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793