గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పరిధి నానక్‌రామ్‌గూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతుడిని సూర్యాపేట జిల్లాకు చెందిన భరత్ (29)గా పోలీసులు గుర్తించారు.
భరత్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే గచ్చిబౌలిలోని ‘గోల్ఫ్ ఎడ్జ్’ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాడు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ భవనంలోని 30వ అంతస్తు నుంచి కింద పార్క్ చేసి ఉన్న కారుపై దూకినట్లు సమాచారం.
ఈ ఘటనను గుర్తించిన అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే భరత్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మృతుడి బంధువు కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment