ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదేనని ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి అభిలాష స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని సమగ్రంగా సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనగా పేర్కొన్నారు.

శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో అభిలాష సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్‌తో పాటు మొత్తం 22 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విలీన ప్రక్రియ, ప్రైవేట్ కళాశాలల భవిష్యత్తు, కొత్త విద్యావిధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు.

1 నుంచి 12వ తరగతి వరకు బోధనకు అవకాశం

ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఆసక్తి చూపితే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను నిర్వహించుకోవచ్చని అభిలాష వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.

అన్ని తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు. మొదట కొన్ని తరగతులతో ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా మిగిలిన తరగతులను కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని యాజమాన్యాలకు సూచించారు.

ఈ నెలాఖరులో మార్గదర్శకాలు?

మరోవైపు ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తోంది. విద్యావేత్తలు, విద్యారంగ నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తోంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ప్రభుత్వం తీసుకోనున్న తుది నిర్ణయం, కొత్త మార్గదర్శకాలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు విద్యారంగంలో ఆసక్తికరంగా మారింది.


Blogger ఆధారితం.