ప్రజల సంపాదనపై ఎన్ని పన్నులు? ఆదాయపు పన్ను రద్దు చేయాలి!

 

నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలి.. 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక వైద్య భద్రత కల్పించాలి.. ప్రభుత్వాలకు సామాజిక కార్యకర్త షామిమ్వి సుల్తాన విజ్ఞప్తి

 ప్రజల సంపాదనపై ఎన్ని పన్నులు? ఆదాయపు పన్ను రద్దు చేయాలి!

### నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలి.. 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక వైద్య భద్రత కల్పించాలి.. ప్రభుత్వాలకు సామాజిక కార్యకర్త షమీం సుల్తానా విజ్ఞప్తి

**హైదరాబాద్‌:** దేశంలో నిజాయితీగా కష్టపడి సంపాదించే సామాన్య ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందని, వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని సామాజిక కార్యకర్త కోరారు. వ్యక్తిగత ఆదాయపు పన్నును దశలవారీగా పూర్తిగా రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఒక వ్యక్తి తన శ్రమతో సంపాదించిన ఆదాయంపై ఆదాయపు పన్ను చెల్లించిన తర్వాత, ఆ డబ్బును ఖర్చు చేసే ప్రతి దశలోనూ జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు, టోల్‌ ఛార్జీల రూపంలో అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడి సంపాదనలో కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, వైద్యం, పొదుపుల కోసం చివరకు ఎంత మిగులుతోందనే ప్రశ్నను ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు.

### ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యత

ఎన్నికల సమయంలో వివిధ ఉచిత పథకాలు ప్రకటించడం కంటే ప్రజలకు జీవితాంతం ఉపయోగపడే నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా విద్య అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని సూచించారు.

తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు పేద కుటుంబాలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకూడదని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కావాల్సిన అవసరం ఉండకూడదని పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రజలకు ప్రభుత్వాలు అందించే దయాదాక్షిణ్యాలు కాదని, అవి ప్రతి పౌరుడికి అందాల్సిన ప్రాథమిక హక్కులని స్పష్టం చేశారు.

### 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక భద్రత

వృద్ధుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి ఉచిత వైద్యం, అవసరమైన మందులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణాలో వయస్సుకు తగిన రాయితీలు కల్పించడంతో పాటు, అవసరమైన వృద్ధులకు ప్రయాణ సౌకర్యాలు ఉచితంగా అందించాలని సూచించారు.

వృద్ధాప్యంలో వైద్యం, ప్రయాణం, కనీస అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా జీవించే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని కోరారు.

### పన్నులకు తగిన అభివృద్ధి కనిపించాలి

ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే కాకుండా, వాటి ద్వారా నాణ్యమైన ప్రభుత్వ వైద్యం, విద్య, రహదారులు, ప్రజా రవాణా, సామాజిక భద్రత వంటి సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.

పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు, గుంతల రహదారులు, డ్రైనేజీ సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చెల్లించే పన్నులకు తగిన అభివృద్ధి కనిపించాలని, ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకత ఉండాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.

### ప్రజల ఆర్థిక స్వేచ్ఛను గౌరవించాలి

నిజాయితీగా సంపాదించే వ్యక్తులు తమ డబ్బును పొదుపు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రోత్సాహకరమైన విధానాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను రద్దుపై సమగ్ర చర్చ ప్రారంభించాలని, ప్రజల పొదుపులను, ఆర్థిక స్వేచ్ఛను గౌరవించాలని ప్రభుత్వాలను కోరారు. ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న విమర్శ కాదని, ప్రజా సమస్యలపై మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్తగా ప్రభుత్వాలకు చేస్తున్న విజ్ఞప్తి అని తెలిపారు.

**ప్రజలకు అనవసరమైన ఉచిత పథకాలు కాదు.. నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం కావాలి. తమ సంపాదనపై ఆర్థిక స్వేచ్ఛ కావాలి. చెల్లించే ప్రతి రూపాయి పన్నుకు తగిన అభివృద్ధి కనిపించాలి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేసినప్పుడే నిజమైన సంక్షేమ రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు..


Blogger ఆధారితం.