ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య!
మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య!
మహబూబాబాద్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 21 పేజీల లేఖ రాసి యువతి తనువు చాలించడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన కుమారస్వామి–సుకన్య దంపతుల కుమార్తె సుష్మిత (24) డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో ఆమె గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల తనను వివాహం చేసుకోవాలని సుష్మిత అనిల్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే కులాలు వేరని, తమ ఇంట్లో పెళ్లికి అంగీకరించరనే కారణంతో అనిల్ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడని సమాచారం. పలుమార్లు అడిగినా పెళ్లిపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సుష్మిత తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 21 పేజీల సూసైడ్ నోట్ రాసి సుష్మిత ఆత్మహత్యకు పాల్పడింది. తనను మోసం చేసిన వారిని వదలవద్దని తల్లిదండ్రులను లేఖలో కోరినట్లు సమాచారం.
కుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుష్మిత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Post a Comment