హైదరాబాద్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పెద్దపీట
హైదరాబాద్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పెద్దపీట
నూతన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం.. సివిల్ సెటిల్మెంట్లను సహించేది లేదు
హైదరాబాద్: నగర నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహేష్ భగవత్.. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో తనకు సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉందని గుర్తుచేశారు. 2004లో సౌత్ జోన్ డీసీపీగా, 2010లో జాయింట్ సీపీ అడ్మిన్‌గా, అనంతరం జాయింట్ సీపీ స్పెషల్ బ్రాంచ్‌గా వివిధ హోదాల్లో పనిచేసినట్లు తెలిపారు. నగరంలో పోలీసింగ్ వ్యవస్థపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.
శాంతిభద్రతలు, మహిళా భద్రతకు ప్రాధాన్యత
కోర్ అర్బన్ రీజియన్ ఏర్పాటుతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి విస్తరించిందని, కొత్త జోన్లు కూడా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.
నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లోనే తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
భూ అక్రమాలు, సివిల్ సెటిల్మెంట్లపై ఉక్కుపాదం
నగరంలో భూముల విలువలు విపరీతంగా పెరగడంతో భూ వివాదాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని మహేష్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్ సెటిల్మెంట్ల పేరుతో జరిగే అక్రమాలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. బతికున్న వ్యక్తులకు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
రిపీటెడ్ నేరస్తులపై నిరంతర నిఘా
నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు. పెండింగ్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తును పటిష్టం చేస్తామని చెప్పారు. పాత నేరస్తులు, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచుతామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో పనిచేసిన పోలీస్ కమిషనర్లు అమలు చేసిన మంచి విధానాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఫ్రెండ్లీ పోలీసింగ్
ప్రజలతో మమేకమవుతూ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే డయల్ 112, డయల్ 100 సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌ను క్రమం తప్పకుండా సందర్శించి ప్రాథమిక పోలీసింగ్ విధానాలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. సాయంత్రం వేళల్లో అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా రోడ్లపై ఉండేలా పెట్రోలింగ్‌ను పెంచుతామని వెల్లడించారు.
సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని మహేష్ భగవత్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉంటేనే పెట్టుబడులు పెరిగి, నగర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Post a Comment