-->

ప్రొ.హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి వేడుకలు

ప్రొ.హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి వేడుకలు


కొమురం భీం జిల్లా, బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నిష్ఠాభివందనాలు తెలిపారు.

డార్ఫ్ జీవిత విశేషాలు:

ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు తలండి రాములు గారు మాట్లాడుతూ, ప్రొ. హైమన్ డార్ఫ్ 1909 జూన్ 22న జన్మించారని, 1930లో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రంలో డాక్టరేటు పొందిన విషయాన్ని గుర్తుచేశారు. వివిధ దేశాల్లో పర్యటించి, గిరిజన జీవనశైలిపై పరిశోధనలు నిర్వహించిన డార్ఫ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో స్థిరనివాసం ఏర్పాటుచేసి, ఆదివాసుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు.

అడవులు, కొండలు, గుట్టల మధ్య నడుమ ఉండే గిరిజన గ్రామాలను పరిశీలించేందుకు వచ్చిన డార్ఫ్, ఆదివాసుల ఆత్మబంధువుగా మారారు. లచ్చుపటేల్ అనే స్థానిక గిరిజనుడు ఆశ్రయం కల్పించగా, డార్ఫ్ తన భార్య బెట్టి ఎలిజబెత్ తో కలిసి మార్లవాయిలో నివాసం ఏర్పాటుచేశారు. మార్లవాయి గ్రామంపై ఏర్పడిన ఆత్మీయతతో, అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటుచేసి, ఆదివాసుల జీవన స్థితిగతులపై విస్తృతంగా పరిశోధనలు చేశారు.

ఆదివాసుల మిత్రుడిగా గుర్తింపు:

డార్ఫ్ ఆదివాసుల కష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేసి ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ కారణంగా గిరిజనుల హృదయాలలో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు.

వేడుకల్లో పాల్గొన్న వారు:

ఈ కార్యక్రమంలో ఆదివాసీ మండల గౌరవాధ్యక్షులు సిడం సకారం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ్య, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు చింతపూడి రాజారాం, మానేపల్లి మల్లేష్, మండల ఉపాధ్యక్షులు సిడం రమేష్, పేదం నరేష్, మేడి సతీష్, గావిడే నీలయ్య, మడే మదనయ్య, చింతపూడి గణపతి తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793