హరీష్ రావు ఢిల్లీలో – న్యాయనిపుణులతో చర్చలు
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన కారణంగా హరీష్ రావు ఢిల్లీలో ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హరీష్ రావు ఎలాంటి ఈడీ కేసుల కోసం రాలేదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు తెలిపారు.
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాదాపు 9 నెలల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన 6 నెలలు గడిచినా, స్పీకర్ చర్యలు ప్రారంభించకపోవడం పట్ల కోర్టు దృష్టిని ఆకర్షించారు. కేశం మేఘా చంద్ర కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ, నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.
హరీష్ రావు ఢిల్లీకి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేదని, పిటిషన్లను ప్రత్యక్షంగా దాఖలు చేయడం అవసరం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన ఢిల్లీ ప్రయాణానికి మరేదైనా ప్రత్యేక కారణాలున్నాయని, వాటి గురించి బీఆర్ఎస్ ముఖ్యులకు మాత్రమే తెలుసునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment