మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
కరీంనగర్ జిల్లా, కరీంనగర్ కలెక్టరేట్‌లో ఈరోజు నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర హంగామాగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వివాదం మరింత ముదరడంతో పరస్పరం తోపులాటకు దారితీసింది.
ఈ ఘటనతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చర్చను గందరగోళంగా మార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా, "మీరు అసలు ఏ పార్టీకి చెందిన వారు?" అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలో ఈ వాగ్వాదం జరగడం ప్రత్యేక చర్చనీయాంశమైంది. అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, "నిధుల వివరాలు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారు" అని ఆరోపించారు.
అదే సమయంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ కేవలం 50 శాతం మాత్రమే జరిగిందని, మిగిలిన రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18,500 కుటుంబాలకు దళితబంధు అందించామన్నారు. తక్షణమే రెండో విడత దళితబంధు నిధులు మంజూరు చేయాలని కోరారు.
"కాంగ్రెస్ నేతలు బెదిరించినా భయపడేది లేదని, తాము రైతుల పక్షాన నిలబడతామన్నదే మా అభిప్రాయం" అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

Post a Comment