కొమురవెల్లి మల్లన్న పట్నంవారం మహోత్సవం
కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పట్నంవారానికి ఆలయం సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వేలాదిమంది భక్తులు క్షేత్రానికి తరలివెళ్లనున్నారు. ఈ మహాజాతరలో పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు రాబోతుండటంతో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
పట్నంవారం ప్రత్యేకత:
సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా పిలుస్తారు. ఈ రోజు మల్లన్న యాదవ వంశానికి చెందిన ఆడబిడ్డ మేడలాదేవితో వివాహమాడిన సందర్భాన్ని గుర్తుచేస్తూ యాదవ భక్తులు విశేషంగా నిర్వహిస్తారు.
యాదవ భక్తుల విశ్వాసం:
హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు శనివారం తమ కుటుంబాలతో కలసి కొమురవెల్లి చేరుకుంటారు. ఆలయంలో స్వామివారి ధూళి దర్శనం చేసుకుంటారు. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు చేయడం ఈ జాతరలో ముఖ్యమైన సంప్రదాయం.
బోనాల సమర్పణ:
స్థానికంగానే కూరగాయలు, మట్టికుండలు కొనుగోలు చేసి, బెల్లంపాయసంతో బోనం తయారుచేసి స్వామివారికి సమర్పిస్తారు. పట్నం వేసి, స్వామివారి ప్రీత్యర్థం బలిపూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు.
ఆదివారం విశేషాలు:
ఆదివారం స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యాం సమర్పించడంతో పాటు ఎల్లమ్మకు కూడా బోనాలు నివేదిస్తారు.

Post a Comment