ఉగాదికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదలకు గుడ్ న్యూస్
హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని పునరుద్ధరించింది.
ఉగాదికి 4.5 లక్షల ఇళ్లకు శంకుస్థాపన
ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించి కార్యాచరణ సిద్ధం చేసింది.
రూ. 12,571 కోట్ల భారీ కేటాయింపు
ఈ పథకం అమలుకు ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 12,571 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ. 3,184 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 3,387 కోట్లు పెంచి మొత్తం రూ. 6,571 కోట్లు మంజూరు చేసింది. దీంతో లబ్దిదారుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ప్రతిపక్ష విమర్శలకు చెక్
ఈ పథకాన్ని త్వరగా అమలు చేయడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా వెనుకడుగు వేయబోమని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది.
ఇప్పటికే 72,000 లబ్దిదారుల ఎంపిక
ఇప్పటికే 72,000 లబ్దిదారులను ఎంపిక చేసి, కొందరికి జనవరి 26న మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మిగతా లబ్దిదారులకు కూడా త్వరలోనే పత్రాలు అందించనున్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరబోతోంది. ఉగాదికి 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం ద్వారా, తెలంగాణ సర్కార్ ప్రజాప్రయోజన పాలనకు పట్టం కట్టిందని చెప్పవచ్చు.

Post a Comment