మహిళా కండక్టర్‌పై యువకుడి దాడి.. గొంతు పట్టుకుని ఫోన్ లాక్కున్న ఘటన
మహిళా కండక్టర్‌పై యువకుడి దాడి.. గొంతు పట్టుకుని ఫోన్ లాక్కున్న ఘటన
మార్కాపురం జిల్లా, జూన్ 6: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం, పొదిలి డిపోకు చెందిన మహిళా కండక్టర్ దుద్దుకూరి పద్మ ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తోంది. ఈ సమయంలో పొదిలి మండలం ఏలూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు బస్సు ఎక్కి రూ.100 నోటు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. చిల్లర అందుబాటులో లేకపోవడంతో మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని టికెట్‌పై రాసిచ్చినట్లు సమాచారం.
అయితే, వెంటనే చిల్లర ఇవ్వాలని యువకుడు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన యువకుడు మహిళా కండక్టర్ గొంతు పట్టుకుని పైకి లేపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
అంతటితో ఆగకుండా కండక్టర్ దుస్తుల్లో ఉన్న సెల్‌ఫోన్‌ను కూడా యువకుడు లాక్కున్నట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన మహిళా ప్రయాణికులు యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
తర్వాత రామతీర్థం సమీపంలో బస్సు దిగిన యువకుడు, పొదిలి వైపు వెళ్తున్న గిద్దలూరు ఆర్టీసీ బస్సులో రన్నింగ్‌లో ఉండగానే ఎక్కాడు. అప్పటికే ఘటనపై సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పొదిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదిలీ చేసినట్లు సీఐ రాజేష్ కుమార్ తెలిపారు.
విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై దాడి చేయడమే కాకుండా ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కోవడం తీవ్రంగా ఖండనీయమని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Post a Comment