-->

నకిలీ పోలీస్ ముఠా బట్టబయలు.. తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం

నకిలీ పోలీస్ ముఠా బట్టబయలు.. తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం

హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ముఠా బట్టబయలు.. తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం

హైదరాబాద్‌లో పోలీసుల పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ముఠాను కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ చర్యలో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి తుపాకులు, పోలీస్ స్టిక్కర్లు ఉన్న కార్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, కూకట్‌పల్లికి చెందిన పూర్ణచందర్ రావుపై గతంలో హర్యానాలో నమోదైన ఒక కేసును సాకుగా చూపి నిందితులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును సీరియస్‌గా తీసుకున్న అధికారులు విచారణ చేపట్టి ముఠా కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారు.

ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘువర్మ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. విచారణలో రఘువర్మపై గతంలో రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదైనట్లు తెలిసింది. అయినప్పటికీ అతడు తన నేర కార్యకలాపాలను కొనసాగిస్తూ, పోలీస్ అధికారిగా నటించి పలువురిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి పోలీస్ స్టిక్కర్లు అమర్చిన రెండు కార్లు, ఒక దేశీయ తుపాకీ, ఒక ఎయిర్ గన్, అలాగే పోలీస్ శాఖలో ఉపయోగించే పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనతో నగరంలో నకిలీ అధికారుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793