వాటర్ ట్యాంక్ రూములో యువకుడి అనుమానాస్పద మృతి
వాటర్ ట్యాంక్ రూములో యువకుడి అనుమానాస్పద మృతి
తూప్రాన్, జూన్ 3: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లి వెంచర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 21 ఏళ్ల యువకుడు అబ్బు హేజీఫా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం, తూప్రాన్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్ షరీఫ్ కుమారుడు అబ్బు హేజీఫా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. అనంతరం ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతని మొబైల్ ఫోన్‌కు పలుమార్లు కాల్ చేయగా స్విచ్ ఆఫ్‌గా రావడంతో అనుమానం పెరిగింది.
దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా యువకుడి ఆచూకీ లభించలేదు. ఇదే సమయంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అబ్బు హేజీఫా స్నేహితుడు ఫోన్ చేసి రావెల్లి శివారులోని ఒక వెంచర్‌లో ఉన్న వాటర్ ట్యాంక్ రూమ్‌లో అతడు ఉరివేసుకుని ఉన్నట్లు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. తమ కుమారుడి మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు వివరాల ఆధారంగా మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో తూప్రాన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment