గంజాయి స్మగ్లింగ్ ముఠా ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర నుంచి రైలు మార్గంలో గంజాయిని నగరానికి తరలించి, చందానగర్ శివారు ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు నిఘా పెట్టి, ప్రత్యేక దాడులు నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో విన్ని, బిక్షు, చంటి, క్రాంతి, నిఖిల్, సాయికిరణ్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువైన 6.47 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా మహారాష్ట్రలోని గంజాయి సరఫరాదారులతో సంబంధాలు కలిగి, రైల్లో అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, గంజాయి సరఫరా చేసే రూట్లు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉన్నారా అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. నగరంలోని యువత గంజాయి వ్యసనానికి గురవుతుండటంతో, దీని అణచివేతకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Post a Comment