మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం
సిద్దిపేట జిల్లాలో వినూత్న ప్రయోగం – మహిళలతో ముచ్చటించిన మంత్రి, ఆర్టీసీ సేవలపై ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం (మే 7) సిద్దిపేట జిల్లాలో వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు. దుద్దేడ టోల్‌గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించి, సాధారణ ప్రయాణికులతో మమేకమయ్యారు.
బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మంత్రి ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, ప్రయాణ అనుభవాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 'మహా లక్ష్మి' పథకం కింద అందుతున్న ఉచిత ప్రయాణ సదుపాయంపై సమాచారం సేకరించారు.
మహిళలు ఉచిత బస్సు సేవలపై స్పందిస్తూ, "ప్రతీ రోజు వేల రూపాయల ఖర్చు ఆదా అవుతోంది. రాష్ట్రంలోని ఎక్కడికైనా ఖర్చు లేకుండా ప్రయాణించగలుగుతున్నాం" అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
"ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.330 కోట్లు మంజూరు చేస్తోంది. గత పాలకులు ఆర్టీసీని బలహీనపరిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ దేశానికి ఆదర్శంగా మారుతోంది," అని పేర్కొన్నారు.
అలాగే, బస్సులో ఉన్న విద్యార్థులతో మాట్లాడి, బాగా చదవాలని ప్రోత్సహించారు. డ్రైవర్లు, కండక్టర్లతో సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలి జేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు చర్చించామని, సమ్మె విరమించి సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment