తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా హుక్రనలో ఉచిత వైద్య శిబిరం
సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం, ఎన్జి హుక్రన గ్రామంలో మానవతా దృక్పథంతో ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమం జరిగింది. డాక్టర్ ప్రేమ్ కుమార్ మరియు ఆయన సతీమణి డాక్టర్ సువర్ణ దంపతులు తమ తల్లిదండ్రులు క్రీస్తు శేషులు పడరీ గుండప్ప-నాగమ్మ జ్ఞాపకార్థంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందించబడ్డాయి. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు, అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణీ కూడా జరిగింది. ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు ఉన్న వారికి ఉచిత కళ్లజోడులు పంపిణీ చేశారు. చిన్నారుల ఆధ్యాత్మిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారికి బైబిల్ పుస్తకాలను కూడా అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, “మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ సేవలను అందించడం మా కుటుంబానికి గర్వకారణం. ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ప్రజలంతా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ, డాక్టర్ ఎం. పర్ల్ సుసన్న, ఇతర వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం గ్రామస్థుల నుండి మంచి స్పందన పొందింది.
Post a Comment