-->

రేషన్ కార్డుల కొరకు పేదల నిరీక్షణకు తెరపడేదెప్పుడో..!?

 

రేషన్ కార్డుల కొరకు పేదల నిరీక్షణకు తెరపడేదెప్పుడో..!?

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం అపేక్షతో ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అర్హులకు కార్డులు మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 32 వేల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. కుటుంబసభ్యుల పేర్ల మార్పులు, చేర్పుల కోసమైనా 10.50 లక్షలమందిని చేర్చి, మే నెల రేషన్ పంపిణీకి సిద్ధంగా ఉంది. అయితే మిగిలిన దరఖాస్తుల పరిశీలన పూర్తవ్వాలంటే మరో రెండు నెలలు పడే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.

అవకతవకలు లేకుండా జాగ్రత్తలు

గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అర్హతలేని వారు లబ్ధి పొందకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కొత్తగా 2.50 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు, 8.10 లక్షల పేర్ల చేర్పుల దరఖాస్తులు స్వీకరించింది. వీటి పరిశీలన అనంతరం 30 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులుగా చేరే అవకాశముందని అంచనా.

సర్వే, యాప్ ఆధారంగా పరిశీలన

ప్రస్తుతం అందిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆధారంగా ఆదాయం, మునుపటి కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. దీంతో రేషన్ కార్డు అర్హత ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగుతోంది.

రేషన్ కార్డుల గణాంకాలు

మే నెల నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 19.15 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరారు. మరోవైపు పాత కార్డుల నుంచి పెళ్లైన కారణంగా 7.10 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి. మే నెలలో కొత్తగా రేషన్ పొందబోయే వారి సంఖ్య 12.10 లక్షలు.

బియ్యం కోటా తగ్గడంతో రద్దీ

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కోటా తక్కువగా ఉండటంతో రేషన్ దుకాణాల వద్ద మొదటి రోజే జనసంద్రం ఏర్పడుతోంది. ఐదు రోజుల్లోనే కోటా ఖాళీ అవుతోంది. రెండో విడత కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ లో 90 శాతం మంది బియ్యం తీసుకున్నారు. గత నెలలో కొంతమంది డీలర్లు కోటా తక్కువగా తీసుకోవడంతో వారికి రేషన్ అందలేదు. ఈ నెలలో అందరికీ రేషన్ అందేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పదివేలు పడిన పేదలకు భరోసా ఎప్పటికి..?

ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసిన పేద కుటుంబాలకు ఎదురుచూపులు తీరడం లేదు. ప్రభుత్వం మరింత వేగంగా నిర్ణయాలు తీసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును మంజూరు చేయాలి అన్నది సామాన్య ప్రజల కోరికగా ఉంది.

Blogger ఆధారితం.