కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బొమ్మెర శ్రీనివాస్ వినతి పత్రం
ఎస్సీ కులాల అభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం అవసరం: హెచ్చరిక
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ఎస్సీ కులాల అభివృద్ధి తీవ్రమైన సంక్షోభంలో పడిందని, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ సిటీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసి, ఎస్సీ సముదాయాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర భూభాగంలో సగం ప్రాంతం వెనుకబడిన ఏజెన్సీగా ఉండటం వల్ల అక్కడి ఎస్సీ కులాలు అభివృద్ధి దిశగా నడవలేక తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్ స్థానాలైన జడ్పిటిసి, ఎంపీటిసీలను జనరల్ కేటగిరీలో కలిపేయడం వల్ల లక్షలాది ఎస్సీలకు ప్రజాప్రతినిధిగా వ్యవహరించే అవకాశాలు దూరమయ్యాయని చెప్పారు.
ఇంకా ఎస్సీ రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు మరియు పోడు భూములకు హక్కులు లేని పరిస్థితిలో ఉండటంతో, వారి జీవితం అంధకారంలో మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల పోరాట జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ రజిని అంబేద్కర్, లాయర్ మల్లన్న, బలవంతపు సంపత్ కుమార్, ఆకృపాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment