ఆపరేషన్ సిందూర్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైనికుల సర్జికల్ స్ట్రైక్స్‌కు మద్దతు
హైదరాబాద్, ఉగ్రవాదంపై మరోసారి గట్టిగా ప్రతిస్పందించిన భారత బలగాలు, పాకిస్తాన్ మరియు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సిందూర్" పేరిట మెరుపు దాడులు జరిపాయి. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ నిర్వహించబడినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఉగ్ర స్థావరాలను సమూలంగా నాశనం చేసి, విజయవంతంగా తిరిగొచ్చిన భారత సైన్యాన్ని దేశవ్యాప్తంగా నాయకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో, AIMIM అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను అభినందించారు. "పహల్గాం లాంటి దాడులకు ఇది సరైన బదులు. మన సైన్యం ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల్ని, వాటి మౌలిక సదుపాయాల్ని పూర్తిగా నాశనం చేయాలి" అని ఒవైసీ పేర్కొన్నారు. చివరగా "జై హింద్!" అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.
ఒవైసీ ఈ ప్రకటనను తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Post a Comment