రాహుల్ గాంధీపై నిందలు వేయడం చేతకాని తనానికి నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీని స్మరించుకోవడం అంటే తీవ్రవాదంపై పోరాటానికి అంకితం కావడమేనని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాలు దేశ అభివృద్ధికి మౌలిక ప్రాతిపదికగా నిలిచాయని తెలిపారు. పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ, దానిని ఎదుర్కొనే విషయంలో కేంద్రం యొక్క వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి అప్పట్లో మద్దతుగా నిలిచిన వాళ్లలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు ముందుండారన్నారు.
అయితే అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గడం దురదృష్టకరమని పేర్కొన్న సీఎం, “ఒకవేళ అవకాశం కలిగినప్పుడు కేంద్రం ధైర్యంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని” అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించిన రేవంత్, “కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పహల్గాం ఘటన జరిగినప్పుడు మేమే ముందుగా మద్దతు పలికాం. కానీ ఆ సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకున్నాడు” అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీపై నిందలు వేయడం చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికేనని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, “వారు తమ రక్తాన్ని ఈ దేశానికి అంకితం చేశారు. అలాంటి కుటుంబంపై విమర్శలు చేయడం చాలా నీచం” అని అన్నారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో ఇందిరా గాంధీ ధైర్యసాహసాలు, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆమె నాయకత్వం దేశ సమగ్రతను నిరూపించిందని తెలిపారు. దేశ సమగ్రతపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నిబద్ధంగా ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Post a Comment