నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ – 25 మంది మావోయిస్టులు మృతి
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం నుండి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన తీవ్ర ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. తాజా సమాచారం ప్రకారం, దాదాపు 25 మంది మావోయిస్టులు హతమయ్యారు, మరో కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందిన నేపథ్యంలో, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) భద్రతా బలగాలు తెల్లవారుఝామున నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ కాగార్‌లో భాగంగా నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం వెదికే ప్రక్రియ ప్రారంభించారు.
ఈ క్రమంలో, నారాయణపూర్ జిల్లా లోపల అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు గుంపుగా కదలాడుతున్నారని గుర్తించిన భద్రతా బలగాలు వారి చుట్టూ ముట్టడి వేసి ఎదురుదాడికి దిగాయి. ఇరుపక్షాల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని ప్రాథమిక సమాచారం. మృతుల్లో కొంతమంది అగ్రనేతలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ నష్టమే తప్పదని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుండటంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు ముమ్మరంగా దాడులు చేస్తుండగా, ఈ ఎన్‌కౌంటర్‌ను భారీ విజయంగా చట్ట అమలుదారులు పరిగణిస్తున్నారు.
Post a Comment