-->

సర్కారు దవాఖానాలో కుంటుపడుతున్న వైద్య సేవలు

 

సర్కారు దవాఖానాలో కుంటుపడుతున్న వైద్య సేవలు

మండల ప్రజల ఆవేదన

బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు తీవ్రంగా కుంటుపడుతున్నాయి. ఈ ఆసుపత్రిని అప్పటి కాంగ్రెస్ హయాంలో మండలంలోని 11 గ్రామాల ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించాలనే దృష్టితో నిర్మించారు. అయితే నేడు అక్కడ అందుతున్న సేవలు నామమాత్రంగానే ఉన్నాయని స్థానికుల ఆవేదన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఉదయం 10 గంటల తర్వాతే వచ్చి విధులను ప్రారంభిస్తున్నారు. ఈ ఆలస్యంతో అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు, గత సంవత్సరం బదిలీ అయిన ఉద్యోగుల పేర్లు ఇప్పటికీ హాజరు రిజిస్టర్లో ఉండగా, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నమోదు చేయకపోవడం గమనార్హం. దీనివల్ల బాధ్యతల నిర్వహణలో అపశృతి ఏర్పడుతోంది.

ఈ సమస్యలపై మంగళవారం స్థానిక విలేకరులు మండల వైద్యాధికారిణిని చరవాణిలో సంప్రదించి వివరణ కోరారు. వారు సమయపాలన లోపం, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత లేమి, పిచ్చి మొక్కల నివారణ వంటి అంశాలపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా, “మీకు వార్తలు ఏమైనా ఉంటే రాసుకోండి” అనే నిర్లక్ష్యంగా స్పందించారు. ఈ సమాధానం విలేకరులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇకనైనా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకుని, ఆసుపత్రిలో సకాలంలో వైద్యుల హాజరు, పరిశుభ్రత, రోగులకు నీటి సదుపాయం, మర్యాదపూర్వక వైద్యం వంటి అంశాలపై దృష్టి సారించాలని మండల ప్రజలు ఆశిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి మీద ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఆవశ్యకమైన చర్యలు వెంటనే తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Blogger ఆధారితం.