-->

గీత హర్షిని జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక

 

గీత హర్షిని జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక

 ఘనంగా సత్కరించిన జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్

కొత్తగూడెం : చండీఘర్‌లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు కొత్తగూడెం జిల్లా నుంచి ఆర్. గీత హర్షిని ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో గీత హర్షిని 65 కేజీల బాలికల ఫ్రీ స్టైల్ విభాగంలో సత్తాచాటుతూ ప్రథమ స్థానాన్ని సాధించి బంగారు పతకంతో మెరిసింది. దీంతో ఆమె జాతీయ పోటీలకు అర్హత పొందింది.

గతంలో కూడా గీత హర్షిని అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన అనుభవజ్ఞురాలు. ఆమె ఈసారి జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక 3 ఇంక్లైన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు, ఒలంపిక్ అసోసియేషన్ చీఫ్ పాట్రన్ శ్రీ నాగ సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన గీత హర్షినిని సాలువతో సత్కరించి, పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గీత హర్షినికి క్రీడా సామాగ్రి, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్త గాంధీ కూడా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. నాగ సీతారాములు మాట్లాడుతూ, “రాష్ట్ర స్థాయిలో చాటిన ప్రతిభను గీత హర్షిని జాతీయస్థాయిలోనూ చాటాలి. ఆమె బంగారు పతకం సాధించి జిల్లాకే కాదు రాష్ట్ర ఖ్యాతికీ దోహదపడాలని” ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి, క్రీడా రిజర్వేషన్ల ద్వారా విద్యార్థులు మంచి భవిష్యత్తును కట్టుదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ సీనియర్ క్రీడాకారిణి పి. నిహారిక అధ్యక్షతన, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కాశీహుస్సేన్, ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేష్, కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇంద్రాల శ్రీధర్, కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి. కృష్ణ, ఫిజికల్ డైరెక్టర్, రెజ్లింగ్ కోచ్ రవి, సీనియర్ క్రీడాకారులు వై. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

గీత హర్షిని ఈ జాతీయ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో బంగారు పతకం సాధించాలని జిల్లా క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Blogger ఆధారితం.