ఆదాయానికి మించిన ఆస్తులు.. ACB అదుపులో మురళీధర్ రావు
హైదరాబాద్, తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ENC) మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంపై సోదాలు నిర్వహించి, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మురళీధర్ రావు, రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ మురళీధర్‌ను అనేకసార్లు విచారించింది. విచారణలో ఆయన ఇచ్చిన వివరాలు, ఆస్తులపై ఉన్న అనుమానాల నేపథ్యంలో ACB ఈ చర్యలు చేపట్టింది.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది. దీంతో 2024 ఫిబ్రవరిలో మురళీధర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తాజా సోదాలలో ఆయన వద్దకు చెందిన విలాసవంతమైన ఆస్తులు, విలువైన పత్రాలు, బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి.
ACB అధికారులు ఆయన ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, ఇతర ప్రాంతాల్లో కూడా అనుసంధానాలు ఉండే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. విచారణలో కొత్త ఆధారాలు వెలుగు చూస్తే మరింతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
Post a Comment