భార్యాభర్తల పంచాయతీ కత్తిపోట్లకు దారి.. ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఒక కుటుంబ వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసి కత్తిపోట్ల కలకలం రేపింది. స్థానికంగా భర్త, భార్య బంధువుల మధ్య జరిగిన పెద్దమనుషుల పంచాయతీ హింసాత్మకంగా మారింది. మాటల తేడా కత్తిపోట్ల దాకా వెళ్లింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ కు చెందిన గాండ్ల గణేష్, మరొకరు ఓదెలకు చెందిన మోటం మల్లేష్ అని గుర్తించారు.
మరొకరైన మధునయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు కారణమైన వివాదం పూర్తిగా వ్యక్తిగతమైనదే అయినా, అది రెండు కుటుంబాల మధ్య రక్తపాతం వరకు దారితీసింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Post a Comment