జనగామలో విషాదం: తల్లితో కలిసి మాజీ కౌన్సిలర్ ఆత్మహత్య
జనగామ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒంటరి జీవితం, అనారోగ్య సమస్యలు భరించలేక తల్లి-కొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గిర్నిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకోగా, మృతులు కాంగ్రెస్ నేత, మాజీ కౌన్సిలర్ దయాకర్ రెడ్డి (55), ఆయన తల్లి అహల్యదేవి (85)గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం, దయాకర్ రెడ్డి రాజకీయ జీవితంలో బిజీగా ఉండటంతో పెళ్లి చేసుకోలేదు. తల్లిని చూసుకోవడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల అహల్యదేవిపై కోతుల దాడి జరిగిన ఘటనలో ఆమె వెన్నుముకకు గాయమై ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో దయాకర్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇంట్లో వారిద్దరే ఉండటంతో శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఆయన అన్న వాసుదేవారెడ్డి హైదరాబాదునుంచి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో అనారోగ్యం, ఒంటరితనమే ఆత్మహత్యకు కారణాలుగా తెలుస్తోంది.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతి వ్యవహారంపై ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment